ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం.

             
                         నేటి మన పాఠశాలల నమోదు నానాటికి దిగజారిపోతుంది అన్నది గణాంకాలు చెబుతున్న కఠోర సత్యం. అధికారుల అలసత్వమో, పెట్టుబడిదారుల స్వార్ధమో,  ప్రపంచీకరణ ఫలితమో,.. విద్య ప్రైవేటీకరణ వైపు వేగంగా పరుగులు తీస్తుంది. .....కాని మన వేదికలు మనసుకి ముసుగేసుకుని మూసవిధానాలనే వల్లెవేస్తున్నాయి.  అందుకే సిద్దాంతాల,నిబందనల చట్రంలో నుండి బయటకు  వచ్చి వాస్తవాలు చర్చించుకుని మన వ్యవస్థను మనమే కాపాడుకోవాల్సిన తరుణమిదే.
                       
                     రాజ్యాంగం మనకు కల్పించిన వాక్ స్వాతంత్ర్యపు హక్కు సాక్షిగా  మీ అనుభవాలను  ,అభిప్రాయాలను నిర్భీతి గా నిస్సహందేహంగా వెళ్ళడించే వాస్తవ వేదికగా దీనిని వినియోగించుకోగలరని ఆశిస్తూ...
                                                                                                                                                                                         మీ 
                                                                                                                                                                                  బొర్రా శ్రీనివాస్.   

PLEASE SEND YOUR OPINIONS TO THIS MAIL

  bsrborra@gmail.com       

ముసుగేసిన వాస్తవగీతం…

వేసవి సెలవులు

                  పాఠశాల పనిదినాల ముగింపు

                      ప్రైవేటు సంస్థల పని ప్రారంభ దినం

                       ఇంటింటి సర్వే, సమాచార సేకరణ

                                 అడ్మిషన్ టెస్టు పేరుతో అడ్వాన్స్ బుకింగ్

    అందమైన బ్రోచర్లు

                   అరచేతిలో పిల్లవాడి భవిష్యత్

           మాటల మాయాజాలం

            తల్లిదండ్రులకు పిల్లలను

    ప్రైవేటు స్కూల్ లో

                                  చదివించే ‘’బాధ్యత’ ‘ను గుర్తుచేస్తున్నాయి

                ‘’పాపం మీ అబ్బాయిని

                                         గవర్నమెంట్ బడికి పంపుతున్నారటగా’’

                 అన్నపక్కింటావిడ మాట

   ఆ ఇల్లాలిని

                  ముల్లులా గుచ్చుతుంటె

                  మగనితో పోరాడి మరీ

                                  ప్రైవేటు ముచ్చట తీర్చుకుంటుంది

 ‘చిరిగిన చొక్కాఅయినా తొడుక్కో

                     పిల్లాడిని ప్రైవేటు స్కూల్ లో చదివించుకో’

 నేటి సరికొత్త సామెత

                  నేడు ప్రైవేటు స్కూలు

 ఒక  సామాజిక హోదా

                   బడాబాబుల చూపు కార్పోరేట్ వైపు

                   సామాన్యుడేమో గల్లీ ప్రైవేటు స్కూలు

                   మన ప్రాంతంలో ఇదే గొప్ప స్కూలు

                            మన కులపోళ్ళ కోసమే ఇక్కడ స్కూల్ పెట్టాం

                   ఇదీ వరస.. దేన్నీ వదలరు

              అడ్మిషనే ఆఖరి మెట్టు

పేరుకు ప్రైవేటు స్కూలు

కాని అది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొoదిన సంస్థ

అగ్గిపెట్టెల్లాంటి గదులున్నా

అగ్నిమాపకదళ పర్మిషన్ వచ్చేస్తుంది

ఆటస్థలం లేకపోయినా

అధికారులకి మాత్రమే కనిపిస్తుంది

వారి స్వచ్చ0ద సేవకు

రాజకీయ నాయకుడు స్ఫూర్తి పొంది

గుర్తింపు కోసం సిఫార్సు చేస్తాడు

అంతర్లీనంగా ఏంజరుగుతుందో అధికారులకెరుక

పదేళ్ల గుర్తింపు పరుగెత్తుకొచ్చేస్తుంది

                     .......ఇక మా పరిస్థితి

                      వృత్యంతర శిక్షణలో

                      భోధనాసామర్ధ్యాలను’ ‘కొత్తగా’’మెరుగుదిద్దుకొని

                      జూన్ పన్నెండున  బడి తెరిచి

                      ’బడిబాట’ అంటూ బడివదిలి

                      తీరిగ్గా ఇల్లిల్లూ తిరిగితే...

                      ఇంకేడ పిల్లలు ఎక్కడో ఫీజులు కట్టారు

                  ఎప్పుడు నుంచో బడికెళుతున్నారు

 ప్చ్.. మా సామర్ధ్యారిత భోధనను

 వారి సామాజిక వర్గం ఓడించింది

  మా యల్ ఇపి గ్రేడింగ్

 వాళ్ళ ర్యాంకుల ఒరవడిలో కొట్టుకుపోయింది

 ప్రైవేటు జల్లెడలోంచి

              జారిపడ్డవారికోసం వెతుకుతున్నాం

          ఎండమావి లో నీటిజాడలా..

                        వాస్తవాలు ఇలా ఉంటే

                        బ్రమలో ఉంది ఎవరు... !

                       తల్లిదండ్రులా...?

                       ఉపాద్యాయులా...?

                       అధికారులా....?

                                      ఆలోచించండి..

                                                           మీ

                                                            ...... బొర్రా శ్రీనివాస్

 

                                  

 మన పయనం ఎటువైపు?

                 ఉపాధ్యాయ మిత్రులారా, మన విద్యా వ్యవస్థ ఎటు పయనిస్తుందో, దానిని నిర్విర్యం చేస్తున్న బీజాల మూలాలు ఏమిటో ఒక్క క్షణం ఆలోచించండి. మన నిర్లిప్తత ఆసరాగా చేసుకుని,  అస్తవ్యస్త నిర్వహణ ద్వారా  వ్యవస్థను   ఏ కొందరి స్వార్ధానికో ఎరగావేసి తద్వారా ప్రభుత్వ విద్యాలయాల పట్ల ప్రజలలో నమ్మకం సన్నగిల్లే విధంగా ,అదే సమయములో ప్రాధమిక స్థాయి విద్యలో సైతం ప్రైవేటు సంస్థలను ప్రొత్సహించే విధంగా చాప క్రింద నీరులా జరుగుతున్న ప్రయత్నాలను గుర్తించి మనల్ని మనమే జాగృత పరుచుకుని మన మూలాలను మనమే కాపాడుకోవాల్సిన  సమయం ఇది కాదా?  ఆలోచించండి!

               అయితే  ఈ  క్రింది వాస్తవాలును ఒక్కసారి పరికించండి.

 

* విద్యలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించటం అంటే ప్రభుత్వం తన భాధ్యతను తగ్గించుకొనే ప్రయత్నం కాదా?*

*  కారణాలు ఏమైనప్పటికి క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పర్యవేక్షణ చేసే MEO  నియామకాల జాప్యం వల్ల నిజంగా నష్టపోతుంది ఎవరు?

          ప్రాధమిక విద్య కాదా?

*ప్రాధమిక విద్యలో  ప్రతి సంవత్సరం ఒక క్రొత్త అంశము ప్రవేశపెట్టి దాని ద్వారా సాధిస్తున్నామనుకొంటున్న ఫలితాలులో వాస్తవికత ఎంత శాతం?

 

*ఒక చిన్న ఉదాహరణగా సంత్సరం మొదట D గ్రేడు  చివర గ్రేడు మరుసటి సంవత్సరం మరలా  మొదట గ్రేడు.. ఎక్కువ  

   శాతం ఈ గణాంకాలే..ఎవరికోసం ఈ నివేధికలు ?

      ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ...ఎన్నెన్నో

 

               మనలో నిబద్దతతో ,అంకితభావంతో  పనిచేయు   ఉపాధ్యాయులు ఉన్నచోట కూడా ఆశించిన రీతిలో నమోదు పెంచలేకపోవటానికి  కారణాలలో మర్రి వృక్షంలా మనల్ని కబళించబోతున్న ప్రైవేటు వ్యవస్థ కూడా ఒకటి  కాదా?

ఈ క్రింది వాస్తవాలను ఒకసారి గమనించండి;-

 

            *రాజ్యాంగములోని ఆర్టికిల్ 30 క్లాజ్ 1ప్రకారం ఒక ప్రైవేటు పాఠశాలకు రికగ్నైజేషన్  ఇవ్వాలంటే ఆ ప్రదేశమునకు ఆ పాఠశాల వాస్తవంగా అవసరం ( serves a real need) అయి ఉండాలి మరియు అప్పటికే అక్కడ నిర్వహించబడుతున్న పాఠశాల నమోదుపై ప్రభావం చూపకూడదు. 

 -- మన పాఠశాలలు ఇన్ని అందరికీ అందుబాటులో  ఉండగా క్రొత్తగా వాటికి పనిగట్టుకుని  గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ..ఎందుకు...ఎవరి ప్రయోజనం కోసం...?

 

             *ప్రైవేటు పాఠశాల ,  సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ( 21 of 1860)  లో ఒక సొసైటీ గా రిజిస్టర్ కాబడి ఉండాలి మరియు  అది ఒక వ్యక్తికి గాని , వ్యక్తుల సమూహానికి గాని ఆదాయము కొరకు నడపరాదు

  ఇది వాస్తవానికి ఎంత దూరం ?   ఇది తెలిసికూడా ఉపేక్షిస్తుంది ఎవరు ?    ప్రోత్సహిస్తుంది ఎవరు?

 

           * ప్రైవెటు పాఠశాలల పనివేళలు ,పనిదినాలు ప్రభుత్వ ఆదేశములకు అనుగుణంగా ఉండాలి.

    -- కాని జూన్ 12 దాకా తెరవకుండా ఉండే సంస్థలు ఎన్ని.,? వాటిని చూసీ చూడనట్లు వదులుతున్నది ఎవరు?

 

* జీఓ నం. 2/2007  ప్రకారము 2009 కల్లా ప్రతి పాఠశాలకు RCC బిల్డింగ్ ఉండాలి.

 కాని ఈ నాటికి కూడా  వాళ్లు బడ్డీ కొట్టుల లాంటి రేకుల షెడ్డులు  చూపించినా  గుర్తింపు  వస్తుంది అంటే లోపం ఎక్కడ ఉంది?

 

 *ఒక్కో పిల్లాడికి  6-8 చ.అ. కూర్చునే స్థలం ఉండాలి

 

 *2000/1000 చ,మీ. ఆటస్థలం ఉండాలి

 

*లైబ్రరీ, కంప్యూటర్ రూం, స్టాఫ్ రూమ్,

 

*ఇండోర్ ఆటలకొరకు 350 చ,మీ. పై కప్పు గల  పెద్ద హాలు

     

  ---    ఒక పాఠశాలకు గుర్తింపునివ్వాలంటే ఇవన్నీ ఉండాలనే  నిబంధనలను జీ ఓ లకే

      పరిమితం చేసి  అవి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి అంటే  తప్పు జరుగుతుంది ఎక్కడ ,లోపం ఎవరిది?

 

      *గుర్తింపు కోసం  Part-IV Fire protection act 1997  ప్రకారం అగ్నిమాపకదళ0 దృవీకరణ , అగ్ని నిరోధక పరికరాలు కలిగి ఉండాలి.  భవనం నిర్మాణం పై ఇంజినీర్ దృవీకరణ  ఉండాలి

     --మండల కేంద్రాలలో అగ్గిపెట్టెలలాంటి పాఠశాలల కూడా ఇవన్నీ వస్తున్నాయంటే .....ఆలోచించండి ?

 

*Cir.memo; 21748/01/97/16-2-1998 , రోడ్ ట్రాన్స్ పోర్ట్ అధారిటి  ప్రకారం పార్కింగ్ స్థలం ,వాహనం మెయింటెనెన్స్ ఉండాలి.

వాస్తవాని అలా ఉన్నవి ఎన్ని?

         

                  మిత్రులారా ఒకరిని విమర్శించటమో  లేక మన లోపాలు ని సమర్ధించుకోవటమో ఈ వ్యాస ఉద్దేశ్యం కాదు.ఒక ప్రవేటు పాఠశాల గుర్తింపుకు ఇవన్నీ అవసరం అని నిర్ధారించినపుడు వాటిని మన పాఠశాలలో అమలు చేయాల్సిన అవసరం ఉంది కదా!

                         బోధనాఅ సామర్ధ్యానికి మన ఉపాధ్యాయులలో కొరత లేదు. అటువంటప్పుడు  ప్రవేటు వాటికి గుర్తింపు ఇవ్వటానికి నిబంధనలు  ఖచ్చితంగా పాటించటం ఎంత అవసరమో అదే సమయంలో ఆ నిబంధలన్నింటిని మనపాఠశాలలో అమలు చేస్తే మన వ్యవస్థలో మంచిమార్పు  వస్తుందని నా అభిప్రాయం.

                  ఏది ఏమైనా లోపం ఎక్కడఉందో -వాస్తవం ఏమిటో ఆలోచించండి!. ఈ సమస్యకు మూలం ఎక్కడుందో తెలిస్తే సగం పరిష్కారం దొరికినట్లే

                                                                                                                                                                                          మీ

                            ......  బొర్రా శ్రీనివాస్

 

  అంతర్జాతీయ మహిళా దినోత్సవం:- 

                       జాతి ,కుల, మత ,దేశ ప్రాంతీయాతీతంగా మహిళాభ్యుదయం కోసం ,స్త్రీ సాధికారతకోసం ప్రపంచం మొత్తం ఏక కంఠంగా నినదించే రోజు  మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

                అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి స్ఫూర్తినిచ్చిన ఘటన 1857 మార్చిలో న్యూయార్క్ నందు జరిగింది. ఇదొక తీవ్రమైన పోరాటం .పనిచేసే ప్రదేశాలలో సౌకర్యాల కోసం  వేతనా పంపుకోసం ,పని గంటల తగ్గింపు కోసం, ఓటు హక్కు కోసం వేలాది మంది మహిళలు సమ్మె చేశారు. కర్మాగారాలలో పని చేయు స్త్రీలు  " ఆకలి కడుపుతో పని చేయడం కన్నా పోరాడుతూ చావడం మేలు" అన్న నినాదంతో సమ్మె చేశారు . ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యజమానులు  జరిపిన కాల్పులలో 146 మంది యువతులు మరణించారు. అయినా పట్టుదల  సడలని ఆ మహీళల పోరాటపటిమ ముందు యజమానులకి తలొగ్గక తప్పలేదు.పోరాటపటిమలో పురుషులకి ఏ మాత్రం తీసిపోమని మహిళలు నిరూపించుకున్నారు.

                      ఈ ఉద్యమం  ప్రపంచ వ్యాప్తంగా అనేక పోరాటలకు స్ఫూర్తి నిచ్చింది. మహిళా ఉద్యమాలకు గుర్తుగా మార్చి8 ని UNO అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా  ప్రకటించింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం లో ప్రధాన అంశాలు- ముఖ్య ఉద్దేశ్యాలు

Ø మహిళలు జీవన స్థితిగతులు ఎలా ఉన్నయి?

Ø మహిళలు జీవించుటకు అందుబాటులో ఉన్న అవకాశాలు ఏమిటి

Ø స్త్రీల మానసిక శారీరక సమస్యలు ఏమిటి?

Ø పేదరికం అణిచివేత వివక్షత నుంచి వారికి విమిక్తి కలిగే మార్గాలు ఏమిటి

Ø ఈ దిశలో ప్రభుత్వ ప్రోత్సాహం ,కార్యాచరణ ఎలావుండాలి?

          ఇలాంటి వివిధ అంశాల పునశ్చరణ,విశ్లేషణ, నూతన కార్యాచరణ

మాహిళ స్థానం :-

           సమాజం అభివృద్ది చెందుతున్న మాట వాస్తవమైనా అంతే మోతాదులో వివక్షత

అన్నింటా కొనసాగుతుంది. lలింగ వివక్షత ,మహిళల మీద అత్యాచారాలు స్త్రీ శిశు విక్రయాలు , వ్యభిచార నరకం ,వరకట్నం, నిరక్షరాస్యత, అపరిశుభ్రత, అనారోగ్యంలాంటి  పలు సమస్యలతో చాలా మంది స్త్రీలు సంపూర్ణ  వికాసమునకు దూరంగానే ఉన్నారు

లింగ వివక్షత:-

          ప్రధానంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతినే లింగ వివక్షత నేటి సమాజానికి సవాలుగా ఉన్నది, 2011 సెన్సస్ ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు 948 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు.  UNO ఈ సమస్య భారతదేశంలో తీవ్రంగా ఉన్నదని చెబుతుంది   2040 నాటికి భారతదేశంలో వధువులు కరువు అవుతారని UNO ప్రకటించింది.

          నేడుకూడా అబ్బాయి అయితే  [+] అని అమ్మయి అయితే [ - ] అనే భావజాలం కొనసాగుతుందంటే మహిళల పట్ల  సమాజం లో ఉన్న గౌరవం ఏ పాటిదో అర్ధం అవుతుంది

  మహిళా సాధికారత :- సామాజికంగా రాజకీయంగా, ఆర్ధికంగా తన కాళ్లపై తాను నిలబడగలిగే అభివృద్దియే సాధికారత. అటువంటి సాధికారత లో ఎక్కడ ఉన్నాము.

   సామాజిక సాధికారత:- సామాజికంగా గమనిస్తే లింగ వివక్షత వేధింపులు ,అత్యాచారాలు , హత్యలు, ఆడపిల్లలును గర్భంలోనే చంపడం, ఆడపిల్లల  అక్రమ రవాణా, వరకట్నం, ఇవన్నీ మహిళల స్థానాన్ని కించపరిచేవిగా ఉన్నాయి తప్ప వారి గౌరవాన్ని పెంచేవి లేవు. ఈ స్థితిని సామాజిక సాధికారత అనగలమా?

రాజకీయ సాధికారత:-  చట్టసభలల్లో మన స్థానం ఎక్కడ? పార్లమెంటులో 11 శాతానికి మించి మహిళా భాగస్వామ్యం లేకపోవటం అవమానకరం. 30సం. లు గా పార్లమెంటులో  33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు నాటకీయ పరిమాణాల మద్య నలుగుతూనే ఉంది.

               ఆరోగ్యం , వైద్యం, ఆహారభద్రత, విద్య, వెనుకబాటుతనం, పౌష్టికాహార లోపం ,బాలింతలు, చంటిపిల్లలు చనిపోవటంలో కూడా మనదేశం అగ్రస్థానంలో ఉంది . దీనిని రాజకీయ సాధికారత అనగలమా..?

ఆర్ధిక సాధికారిత :-

            ఆర్ధికంగా మహిళలు నిలబడితేనే సమాజాభివృద్ది అని పాలకులు చెబుతారు. ఆర్ధిక సంస్కరణల పున్యమా అంటూ ఉత్పాదక రంగం పెరగకపోవటంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అసంఘటిత రంగం బాగా పెరిగిపోయి వేతనాలలో వ్యత్యాసాలు, ఉద్యోగ భద్రత లేకపోవటం, పనిగంటలు పెరగటం , రాత్రి పూట పనిచేసే సెక్టారులు ఉన్నాయి. ఉద్యోగం నుండి  తొలగొంచాలంతే ముందుగా మహిళలనే తొలగిస్తారు. ఇవన్నీ మహిళల ఆర్ధిక వెనుకుబాటకు దారి తీస్తున్నయి. దీనిని ఆర్ధిక సాధికారత అనగలమా?

విద్య :-

           బాలికలు 100 % పాఠశాలలో చేరడం లేదు. 1 నుండి 5వ తరగతిలోపే 20% డ్రాపవుట్స్ అవుతున్నారు. పదవతరగతిలోపు  శాతం మంది  బాలికలు బడికి దూరం అవుతున్నారు దీనికి కారణం ప్రస్తుత సామాజిక కారణాలు ,వారి ఆర్ధిక స్థితి సరిగా లేకపోవటం. ప్రభుత్వ విధానాలలో విద్యారంగంలో అనేక మార్పులు వొస్తున్నా చదువుకు దూరం అవుతూనే ఉన్నారు. విద్యావంతురాలైన మహిళ  సమాజాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తుంది. కాని విద్యారంగం పట్ల పాలకులు తీరు తమ బాద్యతనుండి తప్పుకోవాలనుకోవటం ద్వారా బాలికల విద్యాభివృద్దికి ఆటంకం అని గమనించాలి.

ప్రచార సాధనాలు- మహిళాభి వృద్ది.:-

         మహిళలు ను గౌరవిస్తున్నాము, వారికి అభివృద్దిలో  భాగ స్వామ్యం చేస్తున్నాము, మీకోసం పధకాలు తెస్తున్నాము అనిచెప్పడం ప్రచారానికే తప్ప నిజమైన సాధికారత దోహదపడటం లేదు. మహిళలను సామాజిక చైతన్యవంతులు గా తయారు చేయు ప్రణాళికలు  ఉండాలి . అది లేకుండా అన్నింటా  అభివృద్ది చెందారు అని చెప్పటం ఆర్భాటమే.

                   విచారకరమైన విషయం ఏమిటంటే ప్రచార సాధనాలు ప్రభుత్వానికి వంత పాడటమే కాని స్త్రీ అభివృద్దికి ఏ విధంగా  సహాయం చేయటం లేదు. ప్రచార సాధనాలు లాభాపేక్షతో మాత్రమే పని చేస్తున్నాయి కాని సామాజిక సమానత్వం కోసం కాదు .నాగరికత వెల్లివిరిసే నేటి సమాజంలో కూడా స్త్రీ పరిస్థితి యధాస్థితిలోనే ఉంది. తిరోగమనంలో ఉంటూనే దానిని ప్రగతి అనుకుంటున్నాను. పైపెచ్చు వ్యాపారం కోసం వ్యాపార ప్రకటనలకోసం స్త్రీని వాడుకోవాల్సిన నికృష్ట

 

స్థితికి దిగజారింది.సమాజం . స్త్రీని వినోదవస్తువుగా ఆట బొమ్మగా మార్చేసి మార్చేసి తమాషా చూస్తున్నారు. ఇది స్త్రీ మాన మర్యాదల దోపిడీ కాదా . ఇది ప్రగతికి ఆనావాలా .. అఙ్ఞానానికి  అనాగరికత నిదర్శనమా? వీరిని సమర్ధించే  మీడియా ఎంత వరకు స్త్రీల పట్ల మంచి వైఖరి ప్రదర్శిస్తుంది.

ముగింపు :-

             నిర్భయ చట్టం తెచ్చినా.. నానాటికి  అత్యాచారాలు వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.  ఆడపిల్లలు యాచకులు గా తిరుగితున్నారు. కట్నం కష్టాలు  తగ్గటం లేదు. అక్షరాశ్యత ఆశించిన విధంగా లేదు. చట్ట సభలలో రిజర్వేషన్లు అమలు కావటం లేదు, సమాన పనికి సమాన వేతనం అమలు కావటం లేదు.  80 శాతం  మహిళలు పని చేస్తున్నా అసంఘటిత రంగాలలో రక్షణ కరువైంది

                దశాబ్ధాలుగా చేసిన పోరాటాల ఫలితం గా కొంత అభివృద్దిని సాధించ గలిగినా మహిళలను ప్రధమ శ్రేణి పౌరులు గా గౌరవించ బడాలంటే పై ఆటంకాలన్నింటీని అధికమించాల్సి ఉంది   ఉద్యోగ ఉపాది కల్పన , చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు ఆర్ధిక స్వావలంభన  మహిళలకి ముఖ్యంగా గ్రామీణ మహిళలకు మరింత చేరువ కావాలి. మహిళా సాధికారత కోసం స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ అంకిత భావంతో కృషి చేయాలి.

               ఆర్ధిక సామాజిక సాంఘిక , రాజకీయ సాంస్కృతిక  స్వాతంత్ర్యం మహిళలకు సిద్దించినప్పుదే నిజమైన మహిళాభ్యుదయం.

                                                                 

                                                                ఫాతిమా సొగారా

                                                               మం.ప.ప్రా.పాఠశాల

                                                             యం.వి .రాజుపాలెం (ఉర్ధూ)

                                                                కర్లపాలెం (మండలం)